ఆత్మీయ సమ్మేళనానికి దూరంగా కాంగ్రెస్ సర్పంచులు
ఆత్మీయ సమ్మేళనానికి దూరంగా కాంగ్రెస్ సర్పంచులు
**సొంత పార్టీ ప్రజాప్రతినిధులనే పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యేపై అసహనం
**ఆత్మీయ సమ్మేళనం ఎందుకోసం.. ఎవరికోసం? అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులు
**గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా అభివృద్ధి పనులు ఎలా చేపడతారని సర్పంచుల నిలదీత
**ఎమ్మెల్యే తీరుపై సర్పంచులు, నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి
యాచారం, మేజర్ న్యూస్ (నవంబర్ 4): ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి యాచారం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ సర్పంచులు గైర్హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బొంగులూరు సమీపంలోని ప్రమిద గార్డెన్స్‌లో బుధవారం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సర్పంచులు, కౌన్సిలర్లను ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత, ఆత్మీయతను పెంపొందించడమే ఈ సమ్మేళనం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, సొంత పార్టీకి చెందిన పలువురు సర్పంచులే ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం పార్టీలో నెలకొన్న అంతర్గత అసంతృప్తికి అద్దం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
*సర్పంచుల గైర్హాజరుపై చర్చ*
యాచారం మండలానికి చెందిన కాంగ్రెస్ సర్పంచులు అరవింద్ నాయక్, ముచ్చర్ల సుగుణ సంపత్, ఏ. నరేందర్ రెడ్డి, సంగం చైతన్య రాజు, బాసాని బుచ్చిరెడ్డి, చిక్కుడు వెన్నెల శేఖర్, డి. రామ్ రెడ్డి, సభావత్ కిషన్ నాయక్, మస్కు అనిత శరణం, కేశమోని రాజు తదితరులు ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకాలేదు. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితోనే తాము కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు సర్పంచుల వర్గం పేర్కొంటోంది.
*తీర్మానం లేకుండా అభివృద్ధి పనులు ఎలా చేపడతారు?*
ఈ సందర్భంగా సర్పంచులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ.. భారత రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్ట నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు గ్రామపంచాయతీ పాలకవర్గం, సంబంధిత అధికారుల భాగస్వామ్యం, నిబంధనల ప్రకారం తీర్మానాలు ఉండాలని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాల్లో సర్పంచులు, వార్డు సభ్యులను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి నేపథ్యంలో యాచారం మండలానికి నిధులు మంజూరు చేసినప్పటికీ, స్థానిక సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా, వారి భాగస్వామ్యం లేకుండానే ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఒక కాంట్రాక్టర్‌తో కలిసి పనులు చేపడుతున్నారని వారు ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరించడం వల్ల గ్రామస్థాయి నాయకత్వం బలహీనపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో అభివృద్ధి పనుల విషయంలో గ్రామపంచాయతీ అధికారులు, సర్పంచులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం ఉండేదని, ప్రస్తుతం తమను పూర్తిగా పక్కన పెడుతున్నారని సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఏ పనులు చేపట్టాలి, వాటి ప్రాధాన్యత ఏమిటి అనే అంశాలను స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
*ఆత్మీయ సమ్మేళనం ఎవరికోసం?*
ఒకవైపు పార్టీ ఐక్యత, నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయత పెంపొందించేందుకు సమ్మేళనాలు నిర్వహిస్తుండగా, మరోవైపు గ్రామస్థాయిలో కీలకమైన సర్పంచులనే పట్టించుకోకపోతే ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రయోజనం ఏమిటని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే ప్రజాప్రతినిధుల సమస్యలను వినడంతో పాటు వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.
*పార్టీలో అసంతృప్తి.. ఎమ్మెల్యే స్పందనపై ఆసక్తి*
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వ్యవహారశైలిపై యాచారం మండలంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం కంటే ముందుగా గ్రామాల సమస్యలు, ప్రజాప్రతినిధుల ఆవేదనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచుల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించి, వారితో చర్చించి సమస్యలను పరిష్కరిస్తారా? లేక పార్టీలో అసంతృప్తి మరింత పెరుగుతుందా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.