మురికికూపంగా రహదారి: కస్తూర్బా హాస్టల్ సమస్యపై ఎమ్‌ఎల్‌ఏ డాక్టర్ కవ్వంపల్లి పరిశీలన
సూర్య - మానకొండూర్ :మండల పరిధిలోని శ్రీనివాస్‌నగర్ గ్రామంలో వెలుగుచూసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ హాస్టల్ డ్రైనేజీ సమస్యపై స్థానిక ఎమ్‌ఎల్‌ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తక్షణమే స్పందించారు. హాస్టల్ నుండి మురికి నీరు రోడ్డుపైకి చేరి, రహదారి అంతా మురికికూపంగా మారిన ఉదంతాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్ ఎమ్‌ఎల్‌ఏ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్‌ఎల్‌ఏ, ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్‌నగర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌కు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, అక్కడ నుంచి వెలువడుతున్న మురికి నీరు నేరుగా ప్రధాన రహదారిపైకి ప్రవహిస్తోంది. దీంతో రోడ్డు మొత్తం బురదమయంగా మారి, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ మురికి గుంతల గుండా ప్రయాణించలేక స్థానికులు, పాఠశాల విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అపరిశుభ్ర వాతావరణం వల్ల దోమలు చేరి, గ్రామంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు ఎమ్‌ఎల్‌ఏకు తమ ఆవేదనను మొరపెట్టుకున్నారు.
సర్పంచ్, గ్రామస్తుల సమస్యలను ఆలకించిన ఎమ్‌ఎల్‌ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ డ్రైనేజీ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. త్వరితగతిన నిధులు మంజూరు చేయించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మేకల మహేందర్, వార్డు సభ్యులు అనవేని రాజు, పలువురు గ్రామస్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.