ఎల్-నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో రామకృష్ణ నాయక్
కుల్కచర్ల, మేజర్ న్యూస్: ఎల్-నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో రామకృష్ణ నాయక్ సూచించారు. కుల్కచర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎల్-నినో ప్రభావం, తాగునీటి సరఫరాపై మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్-నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి, ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి, ఏపీవో చంద్రశేఖర్, మండల విద్యుత్ శాఖ అధికారి నాగరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.