రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి
రైతులకు తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి
ఎండిపోయిన పంటలను పరిశీలించిన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
(రంగారెడ్డి - మేజర్ న్యూస్ ): జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని, జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఇప్పలపల్లి, వేముల గ్రామాల్లో ఆయన పర్యటించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్‌రావు, రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా నాయకులతో కలిసి రైతుల పంట పొలాలను పరిశీలించారు. వర్షాభావంతో ఎండిపోయిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదిక పంపి తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై సమిష్టిగా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
రాబోయే ఆరు నెలలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఆరు నెలలపాటు నెలకు 10 కిలోల బియ్యంతో పాటు పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు.
ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ.15 వేలు, వరి పంటకు రూ.30 వేలు, పత్తి పంటకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. రైతులు పంటల సాగు కోసం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించాల్సిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పక్కన పెట్టారని విమర్శించారు. జిల్లాలోని 27 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తక్షణమే రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి సీపీఐ నాయకులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.