పర్యాటక శాఖ అధికారులతో కలిసి కమలాపూర్ చేరువును సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్.పి సంజీవరెడ్డి
మానూర్ మండల పరిధిలోని కమలాపూర్ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మంగళవారం పర్యాటక శాఖ జిల్లా డిఈ శ్రీశైలం తో కలిసి చెరువును సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించి, సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పర్యాటకుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. కమలాపూర్ చెరువును ఒక అందమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం ద్వారా మానూర్ మండలంతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గానికి పర్యాటక రంగంలో గుర్తింపు తీసుకురావచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. మంజూరైన రూ.5 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి, పనులు త్వరితగతిన ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, స్థానిక ప్రాంతాలకు కొత్త గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజి రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ గ్రామ సర్పంచ్ రమేష్ నాయక్, ఉప సర్పంచ్ మరియు కౌన్సిలర్లు బి.రాజు, షారూఖాన్, సుబుర్, ఏఈ సోహెల్ తదితర ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు