మండలంలో ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవం
కోటబొమ్మాళి అక్టోబర్ 27, మేజర్ న్యూస్: మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిన్నసాన, దంత, పెద్దబమ్మిడి, నిమ్మాడ, చిట్టేవలస ఎంపీటీసీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నసాన నుంచి వాన లక్ష్మి,దంత నుంచి మెండ పాపారావు,పెద్దబమ్మిడి నుంచి కింజరాపు అమ్ములు, నిమ్మాడ నుంచి నేతింటి లక్ష్మి, చిట్టేవలస ప్రాదేశికం నుంచి తర్ర రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు.