మేయర్ సీటు తో సహా 62 డివిజన్లు గెలుచుకుంటాం -- టిడిపి జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు, మేజర్ న్యూస్ :రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరులోని 62 డివిజన్‌లను నూటికి నూరుపాళ్ళు కూటమి కైవసం చేసుకోవడం ఖాయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నికను కూడా ఏకపక్షం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. అలాగే బీసీలకు న్యాయం చేయాలనే సదాశయంతో 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చిన జీవోను సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పారు. ఇదంతా వైసీపీ పుణ్యమేనంటూ ఆయన ఎద్దేవా చేశారు. అయినప్పటికీ పార్టీ పరంగా బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చేలా 34శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం సుముఖంగానే ఉందంటూ ఆయన వెల్లడించారు. వైసీపీలో ఉన్న బీసీ నేతలు కూడా ఇటువంటి విధానాలను వ్యతిరేకించాలని ఆయన హితవు పలికారు. సమావేశంలో టీడీపీ ఏలూరు EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు,అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు మీరావలీ, ఏపి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ బ్యూరో బాలసౌరి, ఏలూరు