andhrapradesh
మానవత్వం చాటిన నకరికల్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య
నకరికల్లు మేజర్ న్యూస్: విధి నిర్వహణలోనే కాకుండా, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ నకరికల్లు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బుర్రి వెంకటప్పయ్య మానవత్వాన్ని చాటుకున్నారు.
నకరికల్లు గ్రామంలోని పాతూరు కొండ కింద నివాసం ఉంటున్న షేక్ దరియా కుమారుడు అల్లాబక్షు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. గత వారం విధి నిర్వహణలో భాగంగా తెలంగాణకు వెళ్లిన ఆయన మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నిరుపేద కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
ఈ విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ బుర్రి వెంకటప్పయ్య శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి తన వంతు సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్న వెంకటప్పయ్యను గ్రామ ప్రజలు అభినందించారు. పోలీస్ విధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ నిరుపేదలకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు కొనియాడారు.