కూటమి ప్రభుత్వ అరాచకాలపై అనంతలో సిపిఐ, సిపిఎం నిరసన ర్యాలీ
కూటమి అరాచకాలపై
అనంతలో సిపిఐ, సిపిఎం నాయకులు నిరసన ర్యాలీ
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలను నిరసిస్తూ సీపీఐ, సీపీఎం రాష్ట్ర సమితుల పిలుపులో భాగంగా అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఇరు పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సీపీఎం సీనియర్ నాయకులు ఓబులు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికల వ్యవస్థను సర్వనాశనం చేసిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారుల నుంచే లాక్కొని చించివేసిన ఘటనలు ఎన్నికల చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు.
ఎన్నికల్లో రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడటమే కాకుండా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించి బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఎన్నికల నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఏకపక్షంగా దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు. కళ్యాణదుర్గం, అనంతపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎన్నికల కేంద్రాల్లోకి తమ అనుచరులను తీసుకెళ్లి దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ. పద్మావతి, సీపీఐ నగర సహాయ కార్యదర్శి బి. రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు సి. లింగమయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్ర శేఖర సీపీఎం నగర నాయకులు వలి, ప్రకాష్, వెంకటనారాయణ ఇర్ఫాన్ , సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎల్లుట్ల నారాయణస్వామి, జె. రామాంజనేయులు, బంగారు భాష, గౌసల్వర్ ఖాజా మున్నా భాషా, లక్ష్మీనారాయణ ఖాజా మొహిద్దిన్ ఎం.ఆనంద్ బీ. తేజ తదితరులు పాల్గొన్నారు.