కొమర్రాజులంకలో రూ.69 లక్షల పనులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు!
సూర్య డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా & రావులపాలెం డెస్క్: కూటమి ప్రభుత్వం పల్లెల సమగ్ర ప్రగతికి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. ఆదివారం రావులపాలెం మండలం కొమర్రాజులంక గ్రామంలో మొత్తం రూ.69 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.
పంచాయతీరాజ్ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల్లో ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ కావడానికి ఈ హెల్త్ క్లినిక్‌లు ఎంతగానో దోహదపడతాయన్నారు.
అనంతరం రూ.33 లక్షల పుష్కర నిధులతో నిర్మించనున్న నూతన రహదారి పనులకు ఆయన శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతోందని, భక్తులు, ప్రజల సౌకర్యార్థం రోడ్లు, ఘాట్లు, తాగునీరు వంటి అన్ని రకాల మౌలిక వసతులను వేగవంతంగా కల్పిస్తామని తెలిపారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.