కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లావ్యాప్తంగా ఎన్నికల సరళిపై పర్యవేక్షణ
నెల్లూరు, మేజర్ న్యూస్ : జిల్లాలో నిర్వహిస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి నిరంతరం పర్యవేక్షించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లావ్యాప్తంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ నిర్వహణకు సంబంధించి అందుబాటులో ఉన్న ఏర్పాట్లను వెబ్‌కాస్టింగ్ ద్వారా సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును నిశితంగా గమనిస్తూ ఎన్నికల ప్రక్రియపై పర్యవేక్షణ కొనసాగించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను పరిశీలిస్తూ, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా పర్యవేక్షణ చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టారు.