ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట పోలీస్ బందోబస్తు బల్లికురవ మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
బల్లికురవ మేజర్ న్యూస్:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు బల్లికురవ మండలంలోని వైదన,కొప్పెరపాడు జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తు,ఓటర్ల క్యూలైన్ల నిర్వహణ,పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను సమీక్షించారు.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుండగా,సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరించి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్),పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయని,ఎవరూ గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.ఓటర్లు,ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు.ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయాలకు,ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా,నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా,శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజలు సంయమనం పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
కొణిదెన నరేంద్ర బల్లికురవ మండలం రిపోర్టర్