ప్రత్యేక వైద్యం కోసం గుజరాత్‌కు తరలివెళ్లిన 18 నెలల ఏనుగు దూడ
సూర్య జాతీయ డెస్క్: జన్యుపరమైన ఎముకల వ్యాధితో బాధపడుతూ నిలబడలేక, నడవలేక ఇబ్బందులు పడుతున్న పద్దెనిమిది నెలల వయసుగల ఏనుగు దూడకు మెరుగైన వైద్యం అందించేందుకు కేరళ నుంచి గుజరాత్‌కు తరలించారు. సుమారు 125 నుంచి 130 కిలోల బరువున్న ఈ ఏనుగు దూడను కేరళలోని కోడనాడ్ ఏనుగుల సంరక్షణ కేంద్రం నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తీసుకువెళ్లారు. రాష్ట్రంలో దీనికి అవసరమైన ప్రత్యేక వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో, నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేరళ అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
పుట్టిన కొద్ది రోజులకే కోడనాడ్ కేంద్రానికి తీసుకువచ్చిన ఈ దూడకు అక్కడే చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే గతంలో ఒకసారి కింద పడటంతో దానికి ఆస్టియోపీనియా వంటి జన్యుపరమైన ఎముకల సంబంధిత రుగ్మత ఉన్నట్లు గుర్తించారు. ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఈ దూడ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవాలనే ఆశతోనే వేరే రాష్ట్రానికి పంపుతున్నామని, ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే తిరిగి కేరళకు తీసుకువస్తామని అటవీ శాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తెలిపారు.
గుజరాత్‌లోని వంతార కేంద్రంలో ఈ ఏనుగు దూడకు హార్మోన్ల చికిత్స మరియు హైడ్రోథెరపీ విధానాలతో ప్రత్యేక వైద్యం అందించనున్నారు. దూడ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ చికిత్స సుమారు నాలుగు నుంచి ఆరు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఈ వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చును వంతార సంస్థ భరిస్తుండటం విశేషం. దూడ సంరక్షణ కోసం దానితో పాటు మొదటినుంచి ఉంటున్న మావటితో పాటు కేరళకు చెందిన అసిస్టెంట్ ఫారెస్ట్ వెటర్నరీ ఆఫీసర్ మరియు ఇతర అధికారుల బృందం కూడా గుజరాత్ వెళ్లారు.
కోడనాడ్ కేంద్రం నుంచి క్రేన్ సహాయంతో ప్రత్యేక యానిమల్ అంబులెన్స్‌లోకి ఏనుగు దూడను ఎక్కించి నెడుంబస్సేరి విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో వెటర్నరీ నిపుణుల పర్యవేక్షణలో జామ్‌నగర్‌కు చేర్చారు. దూడ చికిత్స పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అటవీ శాఖ ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతి వారం నివేదికలను సమర్పించనుంది. జంతు ప్రేమికులు, అధికారులు ఈ దూడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.