బీహార్‌లో ఎన్‌కౌంటర్: దానాపూర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
సూర్య క్రైమ్ డెస్క్, పాట్నా: బీహార్ రాజధాని పాట్నా శివారు ప్రాంతమైన మనేర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పాట్నా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు కరడుగట్టిన నేరస్థులు హతమయ్యారు. మనేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్‌పూర్ గంగా నదీ తీరంలో దాక్కున్న ముఠాపై పోలీసులు దాడి చేయగా, ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మనేర్ ఎస్హెచ్‌ఓ రజనీష్ కుమార్ చేతికి బుల్లెట్ గాయమైంది.
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిని జేపీ యాదవ్, బబ్లూ కుమార్, రాజేష్ శర్మలుగా గుర్తించారు. వీరు గత అక్టోబర్ 19న మనేర్ ప్యాక్స్ (PACS) చైర్మన్ సంజీత్ కుమార్‌ను దారుణంగా కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లు, ఒక దేశవాళీ తుపాకీ, భారీ సంఖ్యలో తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆసుపత్రి వద్ద బంధువుల వీరంగం.. స్వల్ప లాఠీఛార్జ్
ఎన్‌కౌంటర్ అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దానాపూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల బంధువులు, స్థానికులు భారీ సంఖ్యలో ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకుని తీవ్ర గందరగోళం సృష్టించారు. వైద్యులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఆసుపత్రిలోని రోగులు, వైద్య సిబ్బంది భద్రత దృష్ట్యా ప్రాంగణాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకుని ఖాళీ చేయించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనేర్, దానాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
2