కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు.. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: తహసీల్దార్ పుష్పలత
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అధికారులు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ హెల్ప్ డెస్క్ ద్వారా ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అవసరమైన దరఖాస్తు విధానం, సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్ తహసిల్దార్ పుష్పలత, డీటీ ఆల్బర్ట్ ప్రాంక్లిన్, ఆర్ఐ రామారావు, జూనియర్ అసిస్టెంట్ భాగ్య లక్ష్మి,gpo మన్నన్ అరవింద్, మల్లికార్జున్, సిబ్బంది పాల్గొని ఓటరు నమోదు ప్రక్రియకు సహకరిస్తున్నారు.