కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పంపా హారతులు
- భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు..
- వేదమంత్రాల నడుమ పంచ హారతుల సమర్పణ
అన్నవరం, మేజర్ న్యూస్ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నవరం క్షేత్రంలోని పవిత్ర పంపా నది తీరాన పంపా హారతుల కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసంలో పవిత్ర నదులకు పూజలు నిర్వహించడం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉండటంతో పంపా నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు.
ఈ సందర్భంగా ముందుగా వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విఘ్నేశ్వర పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర పంపా నదీమతల్లికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి, నూతన చీరను సమర్పించి భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించారు. తదనంతరం వేదపండితులు పవిత్ర మంత్రాలను పఠిస్తుండగా సంప్రదాయబద్ధంగా పంచ హారతులను సమర్పించారు. హారతుల వెలుగులతో పంపా నది తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి పవిత్రతను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. లోక కల్యాణం, సకల జనుల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని నదీమతల్లిని ప్రార్థించారు. కార్తీక మాసంలో పవిత్ర నదులను పూజించడం, దీపారాధనలు నిర్వహించడం హిందూ సంప్రదాయంలో విశిష్టమైన ఆచారాలుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పంపా హారతుల కార్యక్రమం సంప్రదాయ ఆచార వ్యవహారాలకు అద్దం పట్టింది. కార్యక్రమం ముగిసిన అనంతరం పాల్గొన్న అధికారులు, సిబ్బంది, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐ.వి. రోహిత్, రాజమహేంద్రవరం దేవాదాయ శాఖ ఆర్జేసీ త్రినాథరావు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్ రావు, డీసీ శివ, డీసీ బాబురావు, ఏసీ అధికారులు, ఇతర అధికారులు, అనధికారులు, దేవస్థానం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదపండితులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని పంపా నదీమతల్లికి హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.