బాల్య వివాహ ముక్త్ భారత్‌పై అవగాహన సదస్సు
అడ్డతీగల, సూర్య ప్రతినిధి :
మండల కేంద్రమైన అడ్డతీగల ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అడ్డతీగల సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాజెక్టు అధికారిణి పి. క్రాంతి కుమారి విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను క్షుణ్ణంగా వివరించారు. యుక్త వయసులో శారీరక అవయవాల ఎదుగుదల, ఆలోచనా విధానంలో వచ్చే మార్పులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆమె సూచించారు. చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల చదువుకు దూరమవడమే కాకుండా, శారీరక బలహీనత, రక్తహీనత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.
విద్యార్థినులు అపరిచితులు చూపే ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దని అధికారులు హితవు పలికారు. కుటుంబ విలువలు, వ్యక్తిగత విలువల ప్రాధాన్యతను వివరిస్తూ, లక్ష్య సాధన దిశగా చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని పేర్కొన్నారు. అలాగే బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు, అవి పనిచేసే తీరుపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, ఎవరికైనా ఎలాంటి ఆపద ఎదురైనా వెంటనే స్పందించేందుకు చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షకురాలు పి. అరుణ లత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపవతి, మహిళా పోలీసులు వెంకట లక్ష్మి, చిన్నయమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.