జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పారదర్శకంగా నిర్వహించాలి..జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మహేష్ కుమార్..
మలికిపురంలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలన…
అమలాపురం మేజర్ న్యూస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు.బుధవారం రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురం మండలంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, విద్యుత్ పునరుద్ధరణ చర్యలు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనమలికిపురం మండలం లక్కవరం గ్రామంలోని దొడ్డా ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల విధులు సజావుగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రాల్లో విద్యుత్, మౌలిక సదుపాయాలపై సమీక్ష
గుడిమెల్లంక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
మలికిపురం మండలంలోని ఏపీ ఈపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, విద్యుత్ సబ్‌స్టేషన్ల పనితీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. గుడిమెల్లంక గ్రామంలో ఎన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది, ఇంకా ఎన్ని ఇళ్లకు సరఫరా అందాల్సి ఉందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
భారీ వృక్షాల తొలగింపునకు తక్షణ చర్యలు
మేడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలో పడిపోయిన భారీ వృక్షాన్ని తొలగింపు పై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. ప్రజలకు, రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా అడ్డంకిగా ఉన్న వృక్షాన్ని తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో పాటు విద్యుత్ సరఫరా, పాఠశాలల పునరుద్ధరణ, రహదారులపై అడ్డంకుల తొలగింపు వంటి పనులను సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ ఐఏఎస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్ రావు, మలికిపురం మండల తహసీల్దార్ రాజకిషోర్, ఎంపీడీవోలు, ఎన్నికల సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు