ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు.
పొలమూరులో భక్తిశ్రద్ధలతో అమ్మవారి కలశ స్థాపన.. 1100 మంది భవానీలకు భిక్ష. అనపర్తి, మేజర్ న్యూస్: మండలంలోని పలు గ్రామాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు, భవానీ మాలధారులు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ మాలలు ధరించిన భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
మండలంలోని పొలమూరు గ్రామంలో దేవి సెంటర్ వద్ద సుమారు 1100 మంది భవానీలకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు.పొలమూరు గ్రామం తూర్పు పేటలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో 43వ దేవీ నవరాత్రుల వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల మధ్య బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా ఆలయ మండపానికి తీసుకువచ్చారు.ముందుగా అమ్మవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలు ఆలయాల వద్ద కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచే అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవానీ మాలధారుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు.