గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే మా లక్ష్యం: వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్
కలిగిరి, మేజర్ న్యూస్ : కలిగిరి మండలం చిన్న అన్నలూరు పంచాయతీ పరిధిలో ఐదో తేదీన జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే నాయకులను ఎన్నుకోవాలని వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్ కోరారు. రెండు గ్రామాలను రెండు కళ్లలా భావిస్తూ గెలుపోటములతో సంబంధం లేకుండా అభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. రైతులు, మహిళలు, వృద్ధులు, యువత సమస్యల పరిష్కారంతో పాటు పశువులకు బీమా సౌకర్యం, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపుతామన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని భరోసా ఇచ్చారు.పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే నిజమైన ప్రజాసేవ. గెలుపు ఉత్సాహంతో, ఓటమి నేర్పిన అనుభవంతో గ్రామాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తాం. ఓట్లు, పదవుల కంటే రెండు గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం అని గడ్డం రంజాన్ స్పష్టం చేశారు.చిన్న అన్నలూరు పంచాయతీ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తమ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.