ఎన్‌హెచ్–44 ఆరు లేన్ల విస్తరణ పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి*
*ఎన్‌హెచ్–44 ఆరు లేన్ల విస్తరణ పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి*
*డీపీఆర్‌లో క్షేత్రస్థాయి అవసరాలు, భవిష్యత్ రవాణా అవసరాలు, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత*
*భూసేకరణ,యుటిలిటీ షిఫ్టింగ్ అనుమతులు, రివైజ్డ్ ఎస్టిమేట్లను సత్వరంగా పూర్తి చేయాలి*
*జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి*
కర్నూలు, అక్టోబర్ 03: జాతీయ రహదారి–44 (NH–44)ను కర్నూలు నుంచి బెంగళూరు వరకు నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించేందుకు రూపొందిస్తున్న సమగ్ర వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR)లో జిల్లా పరిధిలో క్షేత్రస్థాయి పరిస్థితులు, స్థానిక అవసరాలు, భవిష్యత్ రవాణా అవసరాలు, రోడ్డు భద్రతా అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్‌లో NH–44 ఆరు లేన్ల విస్తరణకు సంబంధించిన భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్, అనుమతులు, అంచనాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎటువంటి బ్లాక్ స్పాట్లు లేకుండా తక్కువ సమయంలో ప్రయాణం చేయటానికి గాను నాలుగు రోడ్ల నుండి ఆరు రోడ్ల వెడల్పుతో డి పి ఆర్ ను తయారు చేయడం జరిగిందని కావున డీపీఆర్ తుది రూపం దాల్చే ముందే అన్ని శాఖల నుంచి అవసరమైన సాంకేతిక సమాచారం, భూసంబంధిత వివరాలు, యుటిలిటీల సమాచారం, అనుమతులు, అంచనాలు, సూచనలను సేకరించి ప్రతిపాదనల్లో పొందుపరచాలని సూచించారు. నిర్మాణ దశలో మార్పులు, రీడిజైన్లు, జాప్యాలు, అదనపు వ్యయాలు తలెత్తకుండా ముందస్తు సమన్వయంతో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కర్నూలు నుంచి బెంగళూరు వరకు సుమారు 323 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల విస్తరణకు డీపీఆర్ రూపొందిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు ఐటీసీ క్రాస్ రోడ్డు నుంచి ఉల్లిందకొండ చెక్‌పోస్ట్ వరకు సుమారు 42 కిలోమీటర్ల మేర విస్తరణ ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత 60 మీటర్ల రైట్ ఆఫ్ వే (ROW)కు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవేను ప్రతిపాదించినట్లు వివరించారు.
*భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్‌కు ప్రాధాన్యత*
హైవే విస్తరణలో భాగంగా కర్నూలు భారత్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ మరియు ఉలిందకొండ ప్రాంతాలలో ఫ్లైఓవర్ నిర్మాణాలకు భూ సేకరణ , తొమ్మిది ప్రదేశాలలో 132 కెవి మరియు 11 కెవి విద్యుత్ లైన్లు, స్తంభాలు షిఫ్టింగ్‌కు సంబంధించి ఏపీ ట్రాన్స్‌కో, పవర్‌గ్రిడ్, APSPDCL తదితర శాఖలతో సమన్వయం చేసుకుని అంచనాలను సత్వరంగా సిద్ధం చేయాలని, వివిధ నీటి సరఫరా పైప్‌లైన్లు, ఇరిగేషన్ కెనాల్లు నాలుగు ప్రదేశాలలో రోడ్డును క్రాస్ చేస్తున్నాయని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.OFC కేబుల్స్ తదితర యుటిలిటీలను ముందుగానే గుర్తించి షిఫ్టింగ్ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 2023లో రూపొందించిన పాత అంచనాలను ప్రస్తుత పరిస్థితులు, తాజా ధరలకు అనుగుణంగా పరిశీలించి అవసరమైన చోట రివైజ్డ్ ఎస్టిమేట్లను సమర్పించాలని ఆదేశించారు. ఇరిగేషన్ కాలువలు దాటే ప్రాంతాల్లో ప్రతిపాదించిన వంతెనలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ నుంచి అవసరమైన అనుమతులు, సాంకేతిక క్లియరెన్సులు త్వరగా పొందాలని తెలిపారు.
*చిన్నటేకూరు వద్ద రీ–అలైన్‌మెంట్ పనులు వేగవంతం చేయాలి*
చిన్నటేకూరు వద్ద ఉన్న సబ్‌స్టాండర్డ్ కర్వ్‌ను సరిచేసి హైవే డిజైన్ ప్రమాణాలకు అనుగుణంగా రీ–అలైన్‌మెంట్ చేపట్టేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్టేక్‌హోల్డర్ల సమావేశం అనంతరం అవసరమైన ఆమోదాలు తీసుకుని 3A, 3D నోటిఫికేషన్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. RWS, మున్సిపల్, ఇరిగేషన్, ట్రాన్స్‌కో, పవర్‌గ్రిడ్, APSPDCL, BSNL, రవాణా తదితర శాఖల పరిధిలోని అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా OFC కేబుల్స్ ప్రతిపాదిత యుటిలిటీ కారిడార్‌లో ఉన్నాయా లేదా అన్నది సంయుక్తంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించారు. ఆరు లేన్ల హైవేలో అనధికారిక పార్కింగ్‌ను నివారించేందుకు అవసరమైన ప్రాంతాల్లో ట్రక్ లే–బైలు, రెస్ట్ ఏరియాలు, రిఫ్రెష్‌మెంట్, ఇంధన సదుపాయాలు వంటి మౌలిక వసతులను డీపీఆర్‌లో పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.
*రోడ్డు భద్రతకు ప్రాధాన్యత*
హైవే రూపకల్పనలోనే రోడ్డు భద్రతా చర్యలను అంతర్భాగంగా పరిగణించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, డివైడర్ ఓపెనింగ్స్ తదితర భద్రతా చర్యలను డీపీఆర్‌లో పొందుపరచాలని ఆదేశించారు. సర్వీస్ రోడ్లు ప్రధాన హైవేతో అనుసంధానమయ్యే ప్రాంతాల్లో కూడా ప్రమాదాల నివారణకు తగిన చర్యలు ముందుగానే చేపట్టాలని తెలిపారు. భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్, ఇరిగేషన్ అనుమతులు, రివైజ్డ్ ఎస్టిమేట్లు, సాంకేతిక అనుమతులు తదితర అంశాలను సంబంధిత శాఖల సమన్వయంతో సత్వరంగా పూర్తి చేసి ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
సమావేశంలో ఆర్ అండ్ బి ఈ.ఈ సునీల్ రెడ్డి , ఎన్.హెచ్ ఎస్డి సి సునీత , ఆర్ వి అసోసియేట్స్ డిపిఆర్ కన్సల్టెంట్ లు వెంకటేశ్వర రెడ్డి ,శ్రీనివాసరెడ్డి , రవితేజ ,సుధాకర్ లు ప్రత్యక్షంగాను, ఎన్ హెచ్ 44 పిడి తరుణ్ , డి పి ఆర్ భానుచందర్ , డిటిసి శాంత కుమారి , ఎస్ఈ హెచ్ ఎన్ ఎస్ ఎస్ రాజన్ బాబు , ఇరిగేషన్ ఎస్ఈ శైలేశ్వర్ , ఎస్ ఈ ట్రాన్స్కో ప్రదీప్ కుమార్, ఆర్డీవో సందీప్ కుమార్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అయ్యారు.