దేవరపల్లి కాలువ గట్టుపై పులి సంచారం: మొబైళ్లలో ఫొటోలు బంధించిన స్థానికులు.. భయాందోళనలో గ్రామాలు!
సూర్య ప్రాంతీయ & క్రైమ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ గట్టు మీదుగా లక్ష్మీపురం రోడ్డు పరిసరాల్లో పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. కాలువ గట్టుపై ఠీవిగా నడుచుకుంటూ వెళ్తున్న పెద్దపులిని చూసిన కొందరు వాహనదారులు, స్థానికులు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు.
ఈ దృశ్యాలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో సమీప గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాలువ గట్టు పరిసరాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పొలాల్లో పశువులను మేపే కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు, స్థానిక పెద్దలు హెచ్చరిస్తున్నారు.
పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. చీకటి పడిన తర్వాత ఒంటరిగా బయటకు రావద్దని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు.