చలో కలెక్టరేట్‌కు అనుమతి లేదు
నిబంధనలు పాటించకపోవడంతో అనుమతి నిరాకరణ
శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా నిర్ణయం
ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
ఒంగోలులో ఈ నెల 12న తలపెట్టిన ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అనుమతిపై పునఃపరిశీలన చేయాలని నిర్వాహకులు కోరిన నేపథ్యంలో వారి అభ్యర్థనను పోలీసుశాఖ పరిశీలించిందన్నారు. అయితే అనుమతికి సంబంధించి విధించిన నిబంధనలు, షరతులను పాటించకపోవడంతో కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. చలో కలెక్టరేట్ నిర్వహణ వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీస్ యాక్ట్-30 అమల్లో ఉన్నందున నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే సభలు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుశాఖ ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. అనుమతి లేని చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనకుండా పోలీసుశాఖకు సహకరించాలని డీఎస్పీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.