బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం!
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, పొత్తుల పరంగా గానీ, పార్టీ పరంగా గానీ బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లే కేటాయించి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.
గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలే (బీసీ) ప్రధాన అండగా ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించి, వారిని సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం గతంలో 34 శాతం రిజర్వేషన్లను అమలు చేసిందని తెలిపారు.
అయితే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడమే కాకుండా, తమ హయాంలో ఇచ్చిన రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లి అడ్డుకుందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్లు తగ్గించడం వల్ల స్థానిక సంస్థల్లో దాదాపు 16,800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరియు నాయకత్వ అవకాశాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఎన్నికల హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను మళ్లీ పెంచేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించిందని, కానీ వైఎస్సార్‌సీపీకి బీసీల పురోగతి ఇష్టం లేకపోవడంతోనే న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెట్టారని మండిపడ్డారు. కోర్టు తీర్పులు ఎలా ఉన్నప్పటికీ, రాజకీయంగా బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడమే తమ కూటమి లక్యమని ఆయన పునరుద్ఘాటించారు.