బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా
చిన్నారుల హక్కులకు రక్షణ, భవిష్యత్తుకు భరోసా
విద్య, ఆరోగ్యం, పోషణతో పాటు భద్రతకు ప్రాధాన్యం
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు వెంకట పద్మలత
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో కలిసి అధికారులతో భేటీ
విజయవాడ, మేజర్ న్యూస్ : బాలల హక్కులను పరిరక్షిస్తూ వారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ ఎన్టీఆర్ జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు వెంకట పద్మలత, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కె.జి.వెంకట పద్మలత బుధవారం విజయవాడలో పర్యటించారు. పలు విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. నలంద విద్యానికేతన్ సిబ్బందితో మాట్లాడి ప్రతి తరగతిగదిలో చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు, సలహాల పెట్టె ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. తరువాత ప్రజాశక్తినగర్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని, సీవీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాలల భిక్షాటనను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం బాలల కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయాలని, గ్రామ, వార్డు స్థాయిలో బాల్య వివాహాల పర్యవేక్షణ కమిటీలను మరింత బలోపేతం చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సంక్షేమానికి జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని సదుపాయాలు, సహకారం అందిస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమం, సాధికారత అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.