అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు
గోకవరం, మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం దేవిచౌక్ శ్రీశ్రీశ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి 24వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవిచౌక్ అమ్మవారి ప్రధానార్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ ఆధ్వర్యంలో సన్నాయి, మేళా తాళాలతో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి దేవి గంగారత్నం, దంపతులను దేవిచౌక్ అమ్మవారి ఆలయ వద్దకు తీసుకువచ్చారు.
ఆలయంలో కలశ స్థాపన, పుణ్యవచనం, సర్వ దేవత మండపారాధన, గోపూజ, అఖండ దీపారాధన,పూజా కార్యక్రమాలు కంబాల శ్రీనివాసరావుగారి దంపతులు, ఘనంగా నిర్వహించారు.అనంతరం అర్చకులు జగన్నాథరావు శర్మ ఇంటి వద్ద నుంచి అమ్మవారి గుడి వరకు సాంప్రదాయ బద్దంగా, అమ్మ వారి కిరీటం, ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువచ్చి, అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారన్నారు. కనకదుర్గమ్మ వారి శరన్నవరాత్రి వేడుకలు అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించుకుందామన్నారు.
ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాల లైటింగ్ నిమిత్తం రూ.10 లక్షలు, అలయంలో పుష్పలంకరణకు రూ.1.50 లక్షలు విరాళం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఉత్సవాలకు ఎటువంటి లోటు లేకుండా నిర్వహించుకోవడానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు, గ్రామ పెద్దలు, రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.