ఆర్వో తీరుపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
*కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి
సంతబొమ్మాలి, నవంబర్ 28,మేజర్ న్యూస్ :
పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించకపోవడంతో , చివరికి ఫోర్జరీ సంతకాలతో విత్ డ్రా అయినట్లు ఆర్వో యం.భాస్కరరావు రిపోర్ట్ ఇవ్వడంపై జిల్లా కలెక్టర్‌కు శనివారం సర్పంచ్ అభ్యర్థులు పాల మహేష్, సుగ్గు నిర్మల ,మాజీ జడ్పిటిసి పాలవసంత రెడ్డి ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన పలువురు ఉపసంహరించుకున్నారు. దీంతో హనుమంతు నాయుడుపేట సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ మద్దతుతో పాల మహేష్, ఆకాశలక్కవరం సర్పంచ్ అభ్యర్థిగా సుగ్గు నిర్మల బరిలో నిలిచారు. అయితే వీరికి ఎన్నికల గుర్తులు కేటాయించాల్సి ఉండగా సాయంత్రం వరకు ఆ ప్రక్రియ పూర్తికాలేదు.
మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ కేంద్రం వద్దే ఉన్న అభ్యర్థులు గుర్తుల కేటాయింపుపై రిటర్నింగ్ అధికారి ఎం. భాస్కరరావును ప్రశ్నించారు. సాయంత్రం ఐదు గంటలకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తానని చెప్పడంతో అభ్యర్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి ఐదు గంటలకు వచ్చి అడగ్గా నెట్వర్క్ పనిచేయడం లేదని, సంతబొమ్మాలి వెళ్లి సమస్య పరిష్కరించి వస్తానని చెప్పి అధికారి వెళ్లిపోయినట్లు అభ్యర్థులు తెలిపారు.
అయితే రాత్రి సమయం అవుతున్నా గుర్తులు కేటాయించకపోవడం, రిటర్నింగ్ అధికారి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి తమ ఆవేదనను అధికారుల ఎదుట వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఎంపీడీవో పార్వతీశం ,డిప్యూటీ ఎంపీడీవో దుంప శ్రీనివాసరావు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, రిటర్నింగ్ అధికారినే అడగాలని సమాధానమిచ్చినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు.
గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ ఎన్నికల గుర్తులు కేటాయించకపోవడం తమకు తీవ్ర అన్యాయం చేయడమేనని పాల మహేష్, సిగ్గు నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న తమ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించడం దారుణమని ఆరోపించారు. గుర్తులు కేటాయిస్తామని చెప్పిన రిటర్నింగ్ అధికారి అందుబాటులో లేకుండా పోవడం, ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా బాధ్యత నుంచి తప్పించుకోవడం అన్యాయమన్నారు. ఆరోజు రాత్రి 10 గంటలకు మీరు విత్ డ్రా అయినట్లు ఆరో భాస్కరరావు రిపోర్ట్ ఇచ్చారని ఎంపీడీవో పార్వతీశం చెప్పడంతో సర్పంచ్ అభ్యర్థులు పాల మహేష్ సుగ్గునిర్మల ఆశ్చర్యపోయారు. మా సంతకాలను ఫోర్జరీ మాకు అన్యాయం చేయడం తగదని వేడుకొన్నారు. న్యాయం జరగకపోవడంతో శనివారం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించి న్యాయం కోరుతామని సర్పంచ్ అభ్యర్థులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి ప్రతినిధి సుగ్గు రామిరెడ్డి సుగ్గు చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.