ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి., తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్ నుంచి అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో తుఫాన్ ప్రభావం, ముందస్తు జాగ్రత్త చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా, మండల స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఇప్పటికే పలు సూచనలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పర్యాటక అధికారిని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలను శుభ్రం చేయాలని డి పి ఓ ను ఆదేశించారు. డ్రైనేజీలు, నీరు ప్రవహించే మార్గాల వద్ద అవసరమైన చోట్ల ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి నీరు ఇళ్లలోకి, నివాస ప్రాంతాల్లోకి చేరకుండా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలు పనులకు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని డ్వామా పి డి ఆదేశించారు. అవసరమైన మేరకు అన్ని రకాలుగా మందులను అందుబాటు పెట్టాలని, సి హెచ్ సి, పి హెచ్ సి లలో జనరేటర్లు, క్యాండీల్స్ అందుబాటు లో వుంటాలని, డాక్టర్ల, వైద్య సిబ్బంది అందురు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించాలి.
తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలకు ప్రభుత్వము కేటాయించిన సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఏ.ఏ.ఎల్.పద్మావతి,ఇంచార్జి డి ఆర్ ఓ.లవన్న, ఆర్డీఓ.ఏ.హరి కుమార్, డి ఎఫ్ ఓ.సౌజన్య, డి యం & హెచ్ ఓ.డాక్టర్ ఎస్.విజయమ్మ,డి సి హెచ్ ఎస్.డాక్టర్ పద్మావతి, డి పి ఓ.నరేష్ కుమారి, డిఆర్డీఏ పి డి.బి.సింగయ్య, ఆర్ టి సి ఆర్ యం .విమల,డి టి సి.పరందామ రెడ్డి, మెప్మా పి డి ఆనంద్ సత్య పాల్, డి ఎస్ ఓ.జగన్మోహన్, సి పి సి డి యల్.ఆంజనేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.