పునరావస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంనియోజకవర్గ పరిధిలో అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా గూడ్స్ గేటు వద్ద డ్రైనేజీ, తూర్పు రైల్వే స్టేషన్ ఆవరణలోని డ్రైనేజీ వ్యవస్థ, సాయిబాబా ఆలయం వద్ద నూతనంగా నిర్మించనున్న పంప్‌హౌస్ ప్రాంతాలను పరిశీలించి, అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.ఆల్కాట్ గార్డెన్స్‌లోని మున్సిపల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఆశ్రయం పొందుతున్న తుఫాను బాధితులతో మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారికి అందుతున్న సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు సేకరించారు.తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో సుమారు 120 కుటుంబాలకు చెందిన 400 మందికి పైగా బాధితులకు ఈ పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించారు. బాధితులకు అవసరమైన సదుపాయాలు అందేలా అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలిస్తూ, వారి సమస్యలను తెలుసుకున్నారు.రూరల్ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా పలువురితో మాట్లాడి తుఫాను ప్రభావం, స్థానిక పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అంశాలపై దృష్టి సారించారు.