12 వ వార్డు అభివృద్ధి కి కృషి - కార్పొరేటర్ బాయినరాణి సునీల్
ఆరిలోవ, మేజర్ న్యూస్ : జీవీఎంసీ,12వ వార్డు రామాలయం వీధిలో 12వ వార్డు కార్పొరేటర్ బాయన రాణి , సునీల్ టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి జీవీఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి ‘ఫ్రైడే డ్రైడే’ స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూలకుండీలు, ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకులు తదితర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వివరించారు. ముఖ్యంగా వాటర్ ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకులు సక్రమంగా మూతలు ఏర్పాటు చేసి, వాటిలో దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ‘డ్రైడే’ పాటిస్తూ, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం రామాలయం వీధిలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారుల పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకుల పరిసరాలు, చెత్త తొలగింపు మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా, రహదారులపై చెత్త పేరుకుపోకుండా తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని జీవీఎంసీ అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.12వ వార్డును అన్ని విధాలా ఆదర్శవంతమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.