సూర్య కరీంనగర్: యూనిక్ మెర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్వయం మల్టీస్టేట్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థలకు సంబంధించిన పెట్టుబడుల మోసం కేసులో CCS–కరీంనగర్ పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. కరీంనగర్-II టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 212/2026 కేసులో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణ ప్రకారం, ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కైలాష్ రాయ్ నెలవారీ పెట్టుబడి పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ పథకాలు, హోటల్ వెకేషన్ ప్యాకేజీల పేరుతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని నమ్మించి పెట్టుబడులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్లు, ప్రాంతీయ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించిన నిందితులు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి బాండ్ పత్రాలు అందజేసినట్లు విచారణలో వెల్లడైంది. 2019లో పలు పథకాల గడువు ముగిసినప్పటికీ పెట్టుబడిదారులకు సొమ్ము తిరిగి చెల్లించలేదని, కోవిడ్ కారణంగా నష్టాలు వచ్చాయని పేర్కొంటూ 2020లో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కరీంనగర్ జిల్లాలో బాధితులకు సుమారు రూ.26 కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడవుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ కైలాష్ రాయ్‌ను ఆదిలాబాద్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. తాజాగా పట్టుబడిన నిందితులు గుడిపాటి గాంధీ, మాకలసోంపల్లి కరియప్ప, ఉల్లిగడ్డల సంగప్ప (హైదరాబాద్), కొమిరె భూమా గౌడ్ (నిజామాబాద్), యేదెళ్ల రమేష్ (పెద్దపల్లి జిల్లా)గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బాధితుల సంఖ్య, సేకరించిన మొత్తం, నిధుల లావాదేవీలు, ఇతరుల ప్రమేయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ పెట్టుబడుల వ్యవహారంలో మోసానికి గురైన బాధితులు తమ సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా CCS–కరీంనగర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.