విధులు నిర్వహిస్తున్న ప్రవళికపై దాడి వారిని పై హత్యానేరం క్రింద కేసు బుక్ చేయాలి :టి జెఎమ్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్
తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో విధులు నిర్వహిస్తున్న మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళికపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ఆధార్ కార్డు లేకపోవడంతో టికెట్ తీసుకోవాలని సూచించిన కండక్టర్ ప్రవళ్లికను ప్రయాణికురాలు తోసివేయడంతో ఆమె కిందపడి ప్రమాదానికి గురైన ఘటన అత్యంత బాధాకరమని యూనియన్ నాయకత్వం పేర్కొంది. ప్రయాణికులకు నిరంతరం సేవలందిస్తూ, వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులపై దాడులకు పాల్పడటం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రనకా ,పగలనక,పండుగలనక నిరంతరం ప్రజలకు సేవలందించే కార్మికులకే రక్షణ లేకపోతే ఎలా? విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై హత్య నేరం క్రింద కేసు బుక్ చేసి నాన్ బెలబుల్ క్రింద అరెస్ట్ చేసి రిమాండుకు పంపి కఠిన చర్య తీసుకోవాలని టి జెఎమ్‌యు డిమాండ్ చేసింది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ సమస్యపై త్వరలో ఆర్టీసీ వీసీ & ఎండీ ని కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, కే . హనుమంత్ ముదిరాజ్, మరియూ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. ఆర్టీసీ కార్మికులపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను యాజమాన్యం తీసుకోవాలని కే . హనుమంత్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు . అలాగే, భవిష్యత్తులో కార్మికులపై ఇలాంటి దాడులు పునరావృతమైతే, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ అన్ని కార్మిక సంఘాలతో ఐక్యంగా ఉద్యమించి, పెద్దఎత్తున కార్యాచరణ చేపడుతుందని హెచ్చరించింది. చివరగా, ఈ ఘటనలో గాయపడిన మహిళా కండక్టర్ ప్రవళ్లిక త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఆకాంక్షించింది.