వైభవంగా వీరన్న స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు
*--మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు..పోమాలలో పండుగ సందడి*
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని పోమాల గ్రామంలో శ్రీ గణపతి,శివపార్వతి,నంది, వీరభద్ర స్వామి,కుమారస్వామి సహిత నవగ్రహాలు,నాగదేవతతో పాటు ధ్వజస్తంభం సహా మొత్తం 18విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా,గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు,హోమాలు,యాగాలు,విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
*తొలిరోజు శనివారం..ప్రత్యేక పూజలు,హోమాలు*
మొదటి రోజు యాగశాల ప్రవేశం,గంగాపూజ,గోపూజ,ద్వారపూజ,మహాగణపతి, మంగళగౌరీ ఆరాధన,స్వస్తి పుణ్యాహవాచనం,సకల దేవతా మండపారాధన నిర్వహించారు.అనంతరం విగ్రహాల ఊరేగింపు చేపట్టారు.సాయంత్రం విగ్రహమూర్తులకు జలాధివాసం,అగ్నిప్రతిష్ఠ,లక్ష్మీ గణపతి హోమం,మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు. *రెండోరోజు ఆదివారం.. విశేష హోమాలు,అభిషేకాలు*
రెండో రోజు ఉదయం మండపారాధన,ఆవాహిత మండపారాధన,ఆవాహిత దేవతా హోమం,విగ్రహమూర్తులకు ధాన్యాధివాసం నిర్వహిస్తారు.సాయంత్రం రుద్ర, మృత్యుంజయ హోమాలతో పాటు విగ్రహమూర్తులకు మహాస్నపన కుంభాభిషేకం,పుష్పాధివాసం,ఫలాధివాసం,శయ్యాధివాసం నిర్వహించి మహా మంగళహారతి,తీర్థప్రసాద వితరణ చేపట్టనున్నారు. *మూడోరోజు సోమవారం..వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన* మూడో రోజు సోమవారం ఉదయం 6.45గంటలకు శ్రవణ నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశమున యంత్ర ప్రతిష్ఠ,ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన నిర్వహించనున్నారు.ఉదయం 9గంటలకు విగ్రహ ప్రతిష్ఠాపన,అనంతరం శాంతి హవనం,మహా పూర్ణాహుతి,మహా మంగళహారతులు నిర్వహిస్తారు.చివరగా భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టనున్నారు.*వైదికుల ఆధ్వర్యంలో మహోత్సవాలు*
శివశ్రీ వీరన్న స్వామి,ప్రభులింగం స్వామి,అభిలాష్ స్వామి,మహేష్ స్వామి,శివచరణ్ స్వామి,సదాశివ స్వామి వైదికత్వంలో ఈ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్,ప్రజాప్రతినిధులు,నాయకులు,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయనున్నారు.