నేటి నుండి కోటిదీపోత్సవం నగరంలోని ఎన్ టీ ఆర్ స్టేడియం వేదికగా ...
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :కార్తికమాసాన్ని పురస్కరించుకుని భక్తిటీవీ ఈ ఏడాది సైతం కోటిదీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. నగరం లోని ఎన్ టీ ఆర్ స్టేడియం వేదికగా నవంబరు 14వ తేదీ ( నేటి నుండి )నుంచి నవంబరు 30వ తేదీవరకు కోటిదీపోత్సవం జరగనుంది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులతో పాటు.. చాగంటి కోటేశ్వరరావు, గరికిపాటి నరసింహారావు వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు విచ్చేయనున్నారు. ప్రతిరోజూ భక్తులే స్వయంగా విశేష పూజలు నిర్వహించుకునే విధంగా కార్యక్రమం జరగనుంది. ప్రసిద్ధ క్షేత్రాల ఉత్సవమూర్తుల కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. 17 రోజుల కార్యక్రమంలో భాగంగా మహాశంఖాభిషేకం, ఉజ్జయిని మహాకాళుని భస్మాభిషేకం, సోమనాథ్ జ్యోతిర్లింగ పూజ, కొల్హాపూర్ మహాలక్ష్మి - కంచి కామాక్షి - మధురై మీనాక్షి అమ్మవార్ల దర్శనం, కోటికుంకుమార్చన, కోటిగాజుల అర్చన తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతిరోజూ కార్యక్రమంలో భాగంగా స్వర్ణలింగోద్భవం, మహానీరాజనం, సప్తహారతులు, సాంస్కృతిక కదంబాలు వంటి ఎన్నో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ఇందుకుగానూ ఎలాంటి రుసుములు ఉండవని.. ఎవరైనా రావచ్చని.. దేవతామూర్తులు, దీపారాధన నిమిత్తం వత్తులు, నూనె, ప్రమిదలు వంటి పూజాద్రవ్యాలన్నింటిని ఉచితంగా ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.