telangana
ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్. కృష్ణయ్య
8 వేల మందితో ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో భారీ ర్యాలీ, రాస్తారోకో
హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి :ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించక పోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా, కోర్సులు పూర్తి చేసిన 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్ లో సుమారు 8 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములు విక్రయిస్తూ, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్న ప్రభుత్వానికి విద్యార్థుల ఫీజుల కోసం రూ.8 వేల కోట్లు కేటాయించడం భారమైందా? అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఓర్వలేకపోతోందని నిలదీశారు. మూడున్నరేళ్లుగా ఫీజుల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్టిఫికెట్లు అందక ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. ఫీజుల కోసం విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయరాదని కోర్టులు ఆదేశించినప్పటికీ కొన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలు సైతం ఫీజులు చెల్లించే వరకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేద, బలహీన వర్గాల జీవితాల్లో విద్య ద్వారా సామాజిక మార్పునకు దోహదపడిందని అన్నారు. ఈ పథకాన్ని నీరుగార్చడంతో పాటు గురుకుల విద్యావ్యవస్థను దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, పథకాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, విద్యావేత్తలు, బీసీ సంఘాలతో చర్చించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజులు మంజూరైన వివరాలను ప్రతి విద్యార్థికి ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్, నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, పర్లగోర్ల మోడీరాందేవ్, సిద్ధప్ప యాదవ్, రాజేందర్, ఎస్. అంజిగౌడ్, శివకుమార్ యాదవ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.