శర్వాణిలో ఘనంగా బాలల దినోత్సవం...
శ్రీకాకుళం నవంబర్ 14 మేజర్ న్యూస్: శర్వాణి విద్యాలయలో భారత మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు, బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా కరూర్ వైశ్యా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కె. గణపతి, సిబ్బంది ఎస్. అనిల్ కుమార్ లు హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రేఖ స్వాగతోపన్యాసం చేస్తూ ప్రపంచ శాంతికాముకుడు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఆయన ఆకాంక్ష మేరకు బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, భావి భారత పౌరులుగా రూపొందనున్న నేటి బాలలు ఆయన ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చి నవభారత నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. తమ సంస్థ వ్యవస్థాపకులు సూరిబాబు ఆశయాలకనుగుణంగా పాఠశాలలో విద్యతో పాటు విద్యేతర సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని, పిల్లల్లో వినమ్రత, సభ్యత, సంస్కారం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలు ఆవశ్యకమని, వీటిని పెంపొందించడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు, సమాజానికి సమాన బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. శర్వాణి విద్యాలయ కరస్పాండెంట్ అందవరపు ఆంజనేయులు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పౌరుల నిర్మాణం తరగతి గదిలో సాధ్యపడుతుందని, సమాజం కూడా ఓ తరగతి గది అని, కొత్త తరంతో ఆదర్శవంతమైన సమాజం నిర్మించడంలో ప్రతి ఒక్కరూ జాగరూకతతో వ్యవహరించాలని, ప్రతి ఒక్క బిడ్డను సంస్కరించి, నిబద్ధత గల పౌరులుగా తీర్చిదిద్దేందుకు అలుపెరగని కృషి చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ముఖ్యఅతిధి కరూర్ వైశ్యా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గణపతి మాట్లాడుతూ పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న సామర్థ్యాలను వెలికి తీయటంలో పాఠశాలలతో పాటు కరూర్ వైశ్య బ్యాంక్ కూడా తమ వంతుగా కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా శర్వాణి విద్యాలయలో కరూర్ వైశ్య బ్యాంక్ తరపున చిత్రలేఖనం, మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందించారు. అదేవిధంగా సర్వాణి విద్యాలయాలో బాలల దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలలో విజేతలకు అతిదుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రిపోర్టర్: డి .రమేష్ ( శ్రీకాకుళం)