హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు
నవంబర్ 18 నుంచి 17వ తేదీకి ముందస్తుగా ఖరారు
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లోని భూముల ప్లాట్ల విక్రయానికి నిర్వహించనున్న ఈ-వేలానికి సంబంధించి ప్రీ-బిడ్ సమావేశం తేదీలో మార్పు చోటుచేసుకుంది. పరిపాలనా కారణాల దృష్ట్యా తొలుత నవంబర్ 18న నిర్వహించాలని నిర్ణయించిన సమావేశాన్ని ఒక రోజు ముందుగా, నవంబర్ 17న నిర్వహించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.
హెచ్‌ఎండీఏ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ యూనిట్ జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 15649/EMU/Auctions/HMDA/2026, తేదీ 24.10.2026 ప్రకారం మూడు కీలక ప్రాంతాల్లోని భూముల ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించేందుకు ప్రక్రియ చేపట్టింది.
మూడు ప్రాంతాల్లోని ప్లాట్లకు సంబంధించి సమావేశం
ఈ-వేలంలో భాగంగా హకీంపేట గ్రామం, శేక్‌పేట్ మండలంలోని సర్వే నంబర్ 102/1లో ఉన్న హుడా హైట్స్ లేఅవుట్ భూమి, కోకాపేట గ్రామం, గండిపేట్ మండలంలోని నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్ నంబర్ 17 (సర్వే నంబర్లు 239, 240), మూసాపేట్ గ్రామం, కూకట్‌పల్లి మండలంలోని ప్లాట్ నంబర్ 1కు సంబంధించి ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ మూడు ఆస్తులకు సంబంధించిన ఈ-వేలంలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల బిడ్డర్లు సవరించిన సమావేశ తేదీ అయిన నవంబర్ 17న హాజరయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రావాలని హెచ్‌ఎండీఏ సూచించింది.
ఈ-వేలం షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు
అయితే, ప్రీ-బిడ్ సమావేశం తేదీలో మాత్రమే మార్పు చేసినట్లు హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. ఈ-వేలం నిర్వహణ తేదీలు, బిడ్డర్ల రిజిస్ట్రేషన్, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చెల్లింపునకు సంబంధించిన చివరి తేదీలు, కనీస బిడ్ పెంపు మొత్తం, ఇతర నిబంధనలు, షరతుల్లో ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించింది. ఇప్పటికే ప్రకటించిన ఈ-వేలం నోటిఫికేషన్‌లోని అన్ని నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.
వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు
ఈ-వేలంలో పాల్గొనదలచిన వారు మరిన్ని వివరాలు, నిబంధనలు, షెడ్యూల్ కోసం హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్ https://hmda.gov.in/auctions/ లేదా ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ పోర్టల్ https://www.mstcecommerce.com ను సందర్శించాలని అధికారులు సూచించారు.