వచ్చే విజయదశమి నాటికి జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేయాలి -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సూర్య,జూలూరుపాడు సీతారామ ఎత్తిపోతల పథకంలో కీలకమైన జూలూరుపాడు టన్నెల్ నిర్మాణ పనులను వచ్చే విజయదశమి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పరిధిలోని భోజ్య తండా సమీప అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న టన్నెల్ పనులను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్,అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్,ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.టన్నెల్ నిర్మాణం,పాలేరు లింక్ కాలువ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టన్నెల్ పనులతో పాటు పాలేరు లింక్ కాలువ నిర్మాణాన్ని సమాంతరంగా చేపట్టి, టన్నెల్ పూర్తయ్యేలోగా కాలువ పనులు కూడా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం జరగకుండా ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే సీతారామ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు తరలించేందుకు మార్గం సుగమమవుతుందని తెలిపారు.
గతంలో భారీ మట్టి కట్టల నిర్మాణంపై నిపుణుల కమిటీ సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేసిందని మంత్రి వివరించారు. టన్నెల్ నిర్మాణంపై సమగ్రంగా పరిశీలించిన అనంతరం నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. తక్కువ ఖర్చుతో, సాంకేతికంగా అనుకూలమైన విధానంలో టన్నెల్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయ్యాయని, అక్కడ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థకే జూలూరుపాడు టన్నెల్ పనులను కూడా అప్పగించినట్లు తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సుమారు 50 వేల ఎకరాలకు గోదావరి జలాలతో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తుమ్మల పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.4 వేల కోట్ల నిధులకు ఆమోదం తెలిపారని చెప్పారు. కాలువల నిర్మాణానికి అవసరమైన భూముల విషయంలో రైతులకు అవగాహన కల్పించి పనులు సజావుగా సాగేందుకు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. భూములు కోల్పోయే అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
గోదావరి జలాలను వినియోగించుకుని జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లను నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సింగభూపాలెం, అన్నదైవం, వెంగళరాయసాగర్, వైరా, లంకాసాగర్ తదితర ప్రాజెక్టులకు నీటిని అందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు తెలిపారు. మారెళ్లపాడు లిఫ్ట్ ద్వారా పినపాక ప్రాంతంలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు గుర్తుచేశారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు సాగునీటి సరఫరా మెరుగుపడుతుందని వివరించారు.
ఎల్‌నినో ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే పరిస్థితులు ఉన్నాయని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా నీరు, విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో చేతికొచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అనంతరం జూలూరుపాడు,వినోబానగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం కాలువలో నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు గోదావరి జలాల వినియోగం కీలకమని అన్నారు. టన్నెల్, అనుసంధాన కాలువల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ దుర్గాప్రసాద్, సీతారామ ఇరిగేషన్ డీఈ చంద్రశేఖర్, ఎంపీడీవో తాళ్లూరి రవి, రాయల నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు దుద్దుకూరి సుమంత్, రామిశెట్టి రాంబాబు, సర్పంచులు బాదావత్ రాంబాబు, భూక్య చంద్రబాబు, గంగావత్ నవీన్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ సిద్దిక్ జూలూరుపాడు