తుఫాన్ తాండవం.. అన్నదాతకు కన్నీటి శాపం!* *ఆరు నెలల కష్టం ఆవిరి.. కళ్లముందే నేలకొరిగిన వరి పంట..* *పుణ్యపురంలో 100 ఎకరాల్లో తీవ్ర నష్టం..* *ఆదుకోవాలని రైతుల వేడుకోలు
--తుఫాన్ తాండవం.. అన్నదాతకు కన్నీటి శాపం!
*ఆరు నెలల కష్టం ఆవిరి.. కళ్లముందే నేలకొరిగిన వరి పంట..*
*పుణ్యపురంలో 100 ఎకరాల్లో తీవ్ర నష్టం..*
*ఆదుకోవాలని రైతుల వేడుకోలు*
వైరా రూరల్ (సూర్య న్యూస్):-
ఆరుగాలం కష్టపడి.. అప్పులు చేసి.. పంట చేతికొస్తుందని ఆశగా ఎదురుచూసిన అన్నదాతకు ప్రకృతి కన్నీళ్లనే మిగిల్చింది. తుఫాన్ రూపంలో విరుచుకుపడిన గాలివాన రైతుల ఆరు నెలల శ్రమను నేలమట్టం చేసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట కళ్లముందే నేలకొరిగి నీటిపాలవడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. వైరా మండలం పుణ్యపురం గ్రామంలో మురసు తుఫాన్ సృష్టించిన బీభత్సంతో అన్నదాతలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు.
సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం మంగళవారం రాత్రికి మరింత ఉధృతమైంది. గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురుగాలులకు గ్రామ పరిధిలో సుమారు 100 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ముఖ్యంగా గ్రామ శివారు పొలాల్లో వరి పూర్తిగా పడిపోయి వర్షపు నీటిలో మునిగిపోయింది. కొన్ని చోట్ల వరి కంకులు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల బురదలో కూరుకుపోయాయి.
ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల కోసం అప్పులు చేశామని, పంట చేతికొస్తే అప్పులు తీర్చుకోవచ్చని భావించామని చెబుతున్నారు. తీరా పంట కోతకు సిద్ధమైన సమయంలో తుఫాన్ రూపంలో ప్రకృతి విరుచుకుపడటంతో పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని కన్నీటిపర్యంతమవుతున్నారు.
మరో రెండు రోజుల్లో కోతలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యామని, ఇప్పటికే కోత యంత్రాలను కూడా మాట్లాడుకున్నామని రైతులు తెలిపారు. ఇంతలోనే గాలివాన విరుచుకుపడి పంటను నేలమట్టం చేసిందని వాపోయారు. నేలకొరిగిన వరిని కోసినా ధాన్యం రాలిపోయే ప్రమాదం ఉందని, నీటిలో నానడంతో నాణ్యత దెబ్బతిని కొనుగోళ్లకు పనికిరాకుండా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
తుఫాన్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి ప్రతి పొలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పంట నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి అర్హులైన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం, పంట బీమా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే నేలకొరగడంతో రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఒకవైపు పెట్టుబడి కోసం చేసిన అప్పులు.. మరోవైపు చేతికందని పంట.. ఇంకోవైపు కుటుంబ పోషణ భారం.. ఇలా అన్నదాతను కష్టాలు చుట్టుముట్టాయి. తుఫాన్ దెబ్బకు నేలకొరిగిన పంటను చూసి కన్నీరు పెట్టుకుంటున్న పుణ్యపురం రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా నిలుస్తుందో వేచి చూడాల్సిందే!