టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా గంట్ల రాజిరెడ్డి,శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా శేరిలింగంపల్లి కి చెందిన సీనియర్ జర్నలిస్టు గంట్ల రాజిరెడ్డి ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన గంట్ల రాజిరెడ్డిని బుధవారం శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. చందానగర్ లోని పి జె ఆర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు ఫైళ్ల విఠల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి లతో పాటు జర్నలిస్టులు హాజరై గంట్ల రాజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంట్ల రాజిరెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు తదితర సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొని రాజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు