telangana
మాధవ్ హిల్స్ పార్క్ లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ ఐటీ ఉద్యోగుల కోసం వినూత్న ఆలోచన
కొండాపూర్,మేజర్ న్యూస్ : ఐటీ ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, స్టార్టప్ బృందాలకు ప్రకృతి ఒడిలోనే ప్రశాంతంగా పనిచేసుకునే సౌకర్యాలు కల్పించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మసీద్‌బండలో ఉన్న మాధవ్ హిల్స్ పార్కును ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.సీఎంసీ కమిషనర్ జి. సృజన ఐఏఎస్ ఆదేశాల మేరకు పార్కులో చేపడుతున్న అభివృద్ధి పనులను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత అభివృద్ధి పనులు, కల్పించనున్న మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రకృతి వాతావరణంలోనే ఉద్యోగ, విద్యా సంబంధిత కార్యకలాపాలు నిర్వహించుకునేలా పార్క్ లో ఆధునిక, పర్యావరణహిత పని ప్రదేశాలను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన సదుపాయాలతో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ వర్క్‌స్పేస్‌లను తీర్చిదిద్దనున్నారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, సందర్శకులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని జోనల్ కమిషనర్ అధికారులకు సూచించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం అందుబాటులోకి వస్తే నగర జీవనశైలిలో పార్కులు కేవలం విశ్రాంతి ప్రదేశాలుగానే కాకుండా పని చేసుకునే ఆహ్లాదకరమైన వేదికలుగా మారనున్నాయి.