సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం
జిన్నారం:మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని సోలక్‌పల్లి 15, 16 వార్డుల్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నకిర్తి జనార్దన్ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నగరానికి చెందిన ఏఐజీ ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్, గైనకాలజీ, ఆంకాలజీ సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై వైద్యులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా, ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నకిర్తి జనార్దన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి వైద్య శిబిరాల ద్వారా మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఉచిత వైద్య శిబిరానికి గ్రామంలోని మహిళల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పావని పరమేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గ్రాన్ వెల్స్ సంస్థ ప్రతినిధులు ప్రజ్ఞ ఏఐజీ ఆసుపత్రి వైద్య బృందం సభ్యులు, స్థానిక నాయకులు రామకృష్ణ, మహిళలు పాల్గొన్నారు.