దీపావళి వేడుకల్లో భద్రతే ముఖ్యం!
(హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న ప్రత్యేక ఇంటర్వ్యూ)
సూర్య స్పెషల్ కరెస్పాండెంట్, హైదరాబాద్ :దీపావళి పండుగ వచ్చేసింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చేందుకు సిద్ధమవుతున్నారు. దీపాల వెలుగులు, బాణసంచా సందడితో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఉత్సాహపడుతున్నారు. అయితే టపాసులు కాల్చే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆ ఆనందం కాస్తా విషాదంగా మారే ప్రమాదం ఉంది. అగ్ని ప్రమాదాలు, కాలిన గాయాలు, కంటి గాయాలతో పాటు పొగ కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టపాసుల విక్రయ దుకాణాల నిర్వాహకులు పాటించాల్సిన భద్రతా చర్యలపై హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు.
టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ఇళ్లకు, వాహనాలకు దూరంగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి.
- పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి.
- సింథటిక్, వదులుగా ఉండే దుస్తులకు బదులుగా నూలు దుస్తులు ధరించాలి.
- చేతిలో పట్టుకుని టపాసులు కాల్చడం, ఇతరుల వైపు విసరడం, ప్రమాదకర ప్రయోగాలు చేయడం వంటివి చేయకూడదు.
- టపాసు వెలిగించిన వెంటనే దూరంగా వెళ్లాలి.
- వెలగని టపాసులను వెంటనే చేతితో ముట్టుకోకూడదు. అవి ఆలస్యంగా పేలే ప్రమాదం ఉంది.
- టపాసులు కాల్చే ప్రాంతంలో నీళ్లు, ఇసుక, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి.
- టపాసులను జేబుల్లో పెట్టుకోవడం, ఇళ్లలో లేదా వాహనాల సమీపంలో నిల్వ చేయడం ప్రమాదకరం.
- మద్యం సేవించి టపాసులు కాల్చకూడదు.
- కంటి గాయాలను నివారించేందుకు రక్షణ కళ్లద్దాలు ఉపయోగించడం మంచిది.
- టపాసుల పొగను నేరుగా పీల్చకూడదు. ఉబ్బసం, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు పొగకు దూరంగా ఉండాలి.
దుకాణాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి
బాణసంచా విక్రయించే దుకాణాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అగ్నిమాపక శాఖ అధికారి సూచించారు.
- సంబంధిత అధికారుల అనుమతులు, చెల్లుబాటు అయ్యే లైసెన్సులు కలిగి ఉండాలి.
- అనుమతించిన పరిమితికి మించి టపాసులను నిల్వ చేయకూడదు.
- దుకాణాల వద్ద దీపాలు, మంటలు, ధూమపానం పూర్తిగా నిషేధించాలి.
- తగినంత ఖాళీ ప్రదేశం ఉండేలా చూసుకోవాలి.
- అగ్నిమాపక పరికరాలు, నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి.
- విద్యుత్తు వైరింగ్, స్విచ్‌లు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- పొగతాగరాదు, మంటలు తీసుకురావద్దు అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
- దుకాణాల వద్ద జనసమ్మర్దం ఏర్పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలి.
- అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలి.
ప్రమాదం జరిగితే ఏం చేయాలి?
టపాసుల వల్ల చిన్నపాటి కాలిన గాయాలు ఏర్పడితే గాయమైన ప్రాంతాన్ని చల్లటి ప్రవహించే నీటితో చల్లబరచాలి. కాలిన గాయాలపై నూనె, పసుపు, టూత్‌పేస్ట్ వంటి పదార్థాలను రాయకూడదు. కంటికి టపాసు తగిలితే కంటిని రుద్దకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. తీవ్రమైన కాలిన గాయాలు, కంటి గాయాలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి.
నిర్లక్ష్యం వద్దు.. భద్రతే ముఖ్యం
దీపావళి అంటే వెలుగులు, ఆనందాలు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే పండుగ. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా పండుగ విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారుల భద్రతపై పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. టపాసులు కాల్చే ముందు భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు తావులేకుండా సురక్షిత దీపావళిని జరుపుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న సూచించారు.
-నరసింహారెడ్డి, సూర్య స్పెషల్ కరెస్పాండెంట్, హైదరాబాద్.