జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
విజయవాడ మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని 16 జడ్పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 18 కౌంటింగ్ హాళ్లు, 281 టేబుళ్లతో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. సుమారు 1,500 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, ఇతర సిబ్బందిని నియమించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు మరో 1,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ సిబ్బందికి ఎన్నికల నిబంధనలు, ఓట్ల లెక్కింపు విధానం, అనుసరించాల్సిన మార్గదర్శకాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శుక్రవారం విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఓల్డ్ మాంటిస్సోరి కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విజయవాడ రూరల్ కౌంటింగ్ కేంద్రాన్ని జడ్పీ సీఈవో పి. సుశీల, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, రిటర్నింగ్ అధికారి కేవీఎస్ఆర్ రవికుమార్‌తో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. కౌంటింగ్ హాళ్లు, టేబుళ్లు, బారికేడ్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, వెలుతురు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జగ్గయ్యపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించి, ప్రక్రియ నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల ఓట్ల లెక్కింపు కోసం ఎస్.జి.ఎస్. కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు. అక్కడ కౌంటింగ్ టేబుళ్లు, కౌంటర్లు, బారికేడ్లు, సిబ్బందికి కేటాయించిన ప్రదేశాలు, కౌంటింగ్ ఏజెంట్లకు సీటింగ్, వారి రాకపోకల మార్గాలను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు నిర్దేశించిన ప్రదేశాలను స్పష్టంగా కేటాయించాలని, హాళ్లలో క్రమశిక్షణ, సమన్వయం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ పటిష్ట భద్రత కల్పించాలని, అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే గుర్తింపు కార్డుల ఆధారంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లా పరిధిలోని మూడు డివిజన్లు, 16 మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును తొమ్మిది కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తొమ్మిది కేంద్రాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు
ఎ. కొండూరు, విస్సన్నపేట, తిరువూరు, గంపలగూడెం మండలాల ఓట్ల లెక్కింపు తిరువూరులోని వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జరుగుతుంది. విజయవాడ రూరల్ మండలానికి సంబంధించి విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం, ఓల్డ్ మాంటిస్సోరి కళాశాలలో, జి. కొండూరు మండలానికి కుంటముక్కలలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తారు. మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు మైలవరంలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్ స్టేడియంలో, ఇబ్రహీంపట్నం మండలానికి కొండపల్లి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలకు జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నందిగామ మండలానికి నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో, చందర్లపాడు మండలానికి నందిగామ కేవీఆర్ డిగ్రీ కళాశాలలో, కంచికచర్ల, వీరులపాడు మండలాలకు కంచికచర్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
నవంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్య తమకు కేటాయించిన కేంద్రాలకు తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరఫున నియమితులైన కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7 గంటలకల్లా సంబంధిత కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. తదుపరి రౌండ్లలో విధులు నిర్వహించాల్సిన ఏజెంట్లు కూడా ముందుగానే చేరుకుని సిద్ధంగా ఉండాలని, కౌంటింగ్ సమయంలో తమకు కేటాయించిన స్థానాల్లోనే ఉండి ఎన్నికల అధికారుల సూచనలు పాటించాలని స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద ఏజెంట్లకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. తొలుత బ్యాలెట్ పేపర్లను నిబంధనల ప్రకారం వర్గీకరించిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారని, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏకకాలంలో కొనసాగుతుందని వివరించారు. ప్రతి దశలోనూ ఎన్నికల నిబంధనలు, నిర్దేశిత విధివిధానాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. రౌండ్ల వారీగా లెక్కింపు వివరాలను రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరించిన తర్వాతే ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు.
పోలీసు భద్రత.. మీడియాకు ప్రత్యేక ఏర్పాట్లు
కౌంటింగ్ కేంద్రాల లోపల, వెలుపల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని కలెక్టర్ వెల్లడించారు. పోలీస్ కమిషనర్, కలెక్టర్, ఆర్డీవోలు, ఏసీపీలు, డీఎస్పీలు, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రతి కేంద్రంలో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక గదిని కేటాయించి, టీవీ లేదా తెర ఏర్పాటు చేయాలని సూచించారు. ఫలితాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా నిర్దేశించిన ప్రాంతాల నుంచే మీడియా కవరేజీకి అనుమతి ఉంటుందని, కౌంటింగ్ హాల్లో దృశ్యాల చిత్రీకరణకు నిర్దేశిత దూరం నుంచి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మాత్రమే అవకాశం కల్పిస్తామని తెలిపారు. రెవెన్యూ, పోలీసు అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను మీడియా ప్రతినిధులు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని కోరారు. అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా సహకరించాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో నందిగామ ఆర్డీవో అనిల్ కుమార్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.