మంత్రి దుర్గేష్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ముత్యాలవారిపాలెం, ముక్కామల ప్రాంతాల్లో ఆచంట కాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తూ గండ్లు పడి పంట పొలాల్లోకి నీరు చేరడంతో పరిస్థితి తీవ్రంగా ఉందని, అక్కడ త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టమని అధికారులకు మంత్రి దుర్గేష్ ఆదేశాలు జారీ చేస్తారు. అదేవిధంగా ఎర్రకాలువ ఉప్పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అధికారుల సూచనలతో సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరారు.ఎన్నికల విధులు ఉన్నప్పటికీ, మిగతా అధికార యంత్రాంగం మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం వేగంగా స్పందించడం వల్లే ఆస్తి నష్టం తగ్గిందని పేర్కొంటూ అధికారుల సేవలను మంత్రి దుర్గేష్ అభినందించారు. నిడదవోలుకు 30 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఫైర్ సిబ్బందిని రప్పించి, రోడ్డు మార్గాలు లేని ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎస్సీ కాలనీలో ముంపు ప్రాంతాల బాధితులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో పౌష్టికాహారాన్ని నిరంతరాయంగా అందిస్తున్నారు.
తిమ్మరాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, డొక్కా సీతమ్మ భవనం, ఎన్టీఆర్ మున్సిపల్ స్కూళ్లలోని పునరావాస కేంద్రాల్లో మంత్రి దుర్గేష్ స్వయంగా బాధితులకు భోజనాలు వడ్డించారు.ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఏఎన్‌ఎమ్‌లు, వైద్య సిబ్బంది ద్వారా మందులు అందుబాటులో ఉంచారు. అత్యవసర వైద్యం కోసం, ముఖ్యంగా గర్భిణులు, చిన్నారుల కోసం అంబులెన్స్‌లను సంసిద్ధంగా ఉంచారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సురక్షిత తాగునీరు అందిస్తున్నామని, విద్యుత్ వ్యవస్థను వేగంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు.ఎర్రకాలువ గేట్లు మూసివేసి అవుట్‌ఫ్లో నియంత్రించామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయని, పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందేలా ఎన్యుమరేషన్ (సర్వే) చేయాలని అధికారులను ఆదేశించారు. ఎత్తైన ప్రాంతాల్లో పశువులను ఉంచి, పశుసంవర్ధక శాఖ ద్వారా దాణా సిద్ధం చేసి మూగజీవాల బాగోగులను కూడా చూస్తున్నామని వెల్లడించారు.