ప్రమాదాల నివారణే ‘మిషన్ ట్రిపుల్ ఆర్’ లక్ష్యం
.గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్‌లో గ్రామ రోడ్డు భద్రత కమిటీ సమావేశం
.నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసుల పిలుపు
గుర్రంపోడ్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు గుర్రంపోడ్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ‘మిషన్ ట్రిపుల్ ఆర్’ (రోడ్ సేఫ్టీ – రెస్పాన్సిబిలిటీ – రైట్ బిహేవియర్) కార్యక్రమంలో భాగంగా గ్రామ రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. నల్గొండ హెడ్ క్వార్టర్స్ అధికారి తాజ్ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మిషన్ ట్రిపుల్ ఆర్‌లోని ప్రధాన సూత్రాలైన రోడ్డు భద్రత, సామాజిక బాధ్యత, సరైన ప్రవర్తనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ ధరించాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
అతివేగాన్ని నియంత్రిస్తూ, పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ముఖ్యంగా యువత, విద్యార్థులు, వాహనదారుల్లో విస్తృత అవగాహన రావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వాహనదారులు, విద్యార్థులు, గ్రామ రోడ్డు భద్రత కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు