పలాస, సాలూరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం
- మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, నవంబరు 6, మేజర్ న్యూస్:
పలాస-కాశీబుగ్గతో పాటు సాలూరు పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పలాస నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ వజ్జ గంగా భవాని, కూటమి కౌన్సిలర్లు, అలాగే సాలూరు నూతన చైర్‌పర్సన్ (జనసేన) గొర్లే విజయకుమారి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఈ విజయం తగిన ప్రతిఫలమని ప్రశంసించారు.
సాలూరు, పలాస పట్టణాల్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం లాంటి మౌలిక సదుపాయాల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, వెంకన్న చౌదరి, పి. విఠల్, బి. నాగరాజు, జి. మాధవరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.