నేడే పరిషత్ ఫలితాలు.. పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు
జిల్లాలోని మూడు ప్రధాన కేంద్రాల్లో 30 మండలాల లెక్కింపు..
696 టేబుళ్లు, 4,114 మంది సిబ్బంది
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా
జెడ్పీటీసీ పోరులో 65.36%, ఎంపీటీసీల్లో 65.51% పోలింగ్ నమోదు
శ్రీకాకుళం, నవంబరు 6 మేజర్ న్యూస్:
జిల్లాలో ముగిసిన స్థానిక సంస్థల సమరంలో ప్రజాతీర్పు వెల్లడయ్యేందుకు రంగం సిద్ధమైంది. పరిషత్ (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుండగా, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసింది. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఫలితాలు వెల్లడించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని అధికారులు తెలిపారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
4 కేంద్రాలు 30 మండలాల లెక్కింపు..
జిల్లాలోని 30 మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను నాలుగు ప్రధాన కేంద్రాల్లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అధికారికంగా ఏర్పాట్లు పూర్తి చేసింది
చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాల (14 మండలాలు): ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.సిగడాం, శ్రీకాకుళం, గార, నరసన్నపేట, పోలాకి, సారవకోట, జలుమూరు.
టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కళాశాల (9 మండలాలు): పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, లక్ష్మీనర్సుపేట (ఎల్.ఎన్. పేట), టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి.
పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల (2 మండలాలు): సోంపేట, కవిటి.
పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల - హైస్కూల్ (5 మండలాలు): పలాస, మందస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, కంచిలి (కంచిలి మండలానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ జూనియర్ కళాశాలలో ఉన్నప్పటికీ, లెక్కింపు మాత్రం హైస్కూల్ ప్రాంగణంలోనే జరుగుతుంది).
696 టేబుళ్లు.. 4,114 మంది సిబ్బంది..
30 మండలాల ఓట్ల లెక్కింపు నిమిత్తం మొత్తం 696 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక సహాయకుడు, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లతో కలిపి ఐదుగురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. 696 మంది సూపర్‌వైజర్లు, 696 మంది సహాయకులు, 2,088 మంది అసిస్టెంట్లు కలిపి మొత్తం 3,480 మంది బాధ్యతలు స్వీకరిస్తారు. అత్యవసర విధులకు 126 మంది సూపర్‌వైజర్లు, 138 మంది సహాయకులు, 370 మంది అసిస్టెంట్లతో కలిపి 634 మందిని రిజర్వ్‌లో ఉంచారు. వెరసి మొత్తం 4,114 మంది ఉద్యోగులు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. అత్యధికంగా రణస్థలంలో 38 టేబుళ్లు (220 మంది సిబ్బంది), గారలో 34 టేబుళ్లు (198 మంది సిబ్బంది) ఏర్పాటు చేయగా, లక్ష్మీనర్సుపేటలో అత్యల్పంగా 12 టేబుళ్లు కేటాయించారు.
తుది ఓటింగ్ గణాంకాలు..
* జెడ్పీటీసీ ఎన్నికలు: 30 మండలాల పరిధిలోని 2,003 పోలింగ్ కేంద్రాల్లో 16,20,965 మంది ఓటర్లు ఉండగా, 10,59,426 మంది ఓటు వేశారు (65.36 శాతం). పురుషులు 4,97,905, మహిళలు 5,62,756, ఇతరులు ఇద్దరు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అత్యధికంగా రణస్థలంలో 81.06 శాతం, లావేరులో 77.79 శాతం ఓటింగ్ నమోదు కాగా, పాతపట్నంలో అత్యల్పంగా 51.00 శాతం రికార్డయింది.
* ఎంపీటీసీ ఎన్నికలు: 30 మండలాల పరిధిలోని 523 ఎంపీటీసీ స్థానాల్లో గల 1,940 కేంద్రాల్లో మొత్తం 15,69,362 మంది ఓటర్లకు గాను 1,028,016 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు (65.51 శాతం). ఇందులో పురుషులు 4,82,625, మహిళలు 5,45,389 మంది ఉన్నారు. ఎంపీటీసీల విభాగంలోనూ రణస్థలం మండలం 81.45 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ మొదలై, అనంతరం బ్యాలెట్ బాక్సులను లెక్కించనున్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు గుర్తింపు కార్డులతోనే హాజరు కావాలని, విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.