చిన్నారుల సందడితో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు 1
చిన్నారుల సందడితో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు
వివిధ రకాల ఆహార పదార్థాల ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులు.. పోషకాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యం
చింతపల్లి మేజర్ న్యూస్ .నల్లగొండ జిల్లా :.
చింతపల్లి మండలం కుర్మేడ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని నవోదయ పాఠశాలలో శుక్రవారం ఉదయం విద్యార్థుల సందడితో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు ఆహార పదార్థాల ప్రాముఖ్యత, పోషకాహార విలువలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను స్వయంగా సిద్ధం చేసి ప్రదర్శించారు. సంప్రదాయ వంటకాలతో పాటు పలు రకాల చిరుతిళ్లు, పండ్లు, కూరగాయలు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందంగా అలంకరించి ప్రదర్శనకు ఉంచారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా తమకు తెలిసిన ఆహార పదార్థాల వివరాలను అతిథులకు వివరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థుల ప్రతిభ, చురుకుదనం, ప్రదర్శనలో చూపిన ఆసక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫుడ్ ఫెస్టివల్ ద్వారా విద్యార్థులకు కేవలం ఆహార పదార్థాల పరిచయమే కాకుండా వాటిలో ఉండే పోషక విలువలు, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆహారం పోషించే పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పాఠ్యాంశాలతో పాటు ఇలాంటి ఆచరణాత్మక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆహార ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి చిన్నారులను అభినందించారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమని, చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రదర్శనలను చూసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనంతుల జంగయ్య గౌడ్, చింతపల్లి మాజీ జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి, చింతపల్లి ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి, కుర్మేడ్ సర్పంచ్ లాలయ్య–చెన్నమ్మ, గొల్లపల్లి సర్పంచ్ అనంతుల శ్రీను గౌడ్, కురుమేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిక్కొండ .సాయిరాం,విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, పాఠశాల అధ్యాపకులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల ప్రతిభకు వేదికగా నిలిచిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా ముగిసింది.