సంగారెడ్డిలో ఇందిరాగాంధీకి ప్రత్యేక అనుబంధం: పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదే
సంగారెడ్డి;ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములే నేటికీ అనేక పేద కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు భూములు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఇందిరాగాంధీదేనని పేర్కొన్నారు. భూములను సాగు చేసుకుంటూ నేటికీ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేశారని గుర్తుచేశారు.మెదక్ పార్లమెంట్ సభ్యురాలిగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీకి సంగారెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఓడీఎఫ్, బీడీఎల్, ఇక్రిశాట్ వంటి సంస్థల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి హోదాలోనూ ఈ ప్రాంతానికి ఆమె విశేష సేవలందించారని గుర్తుచేశారు.దేశ భద్రత, సమగ్రత కోసం క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ 1984లో హత్యకు గురయ్యారని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనలో దేశ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి పునాదులు పడ్డాయని తెలిపారు.ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజల కోసం పనిచేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇందిరాగాంధీకి నివాళులర్పించారు.